Monday, 10 November 2014

70. ఎక్కడికీ వెళ్ళలేకపోతున్నా.......


ప్రశ్న :  నా వయస్సు 17 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నేను రాత్రిళ్ళు నిద్రలో మూత్రం పోసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచీ ఇలాగే జరుగుతోంది. పగటి వేళ కూడా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది. రాత్రిళ్ళు నిద్దట్లో మూత్ర విసర్జన వల్ల ఎక్కడికీ వెళ్ళలేకపోతున్నా. నా దుప్పట్లు ఎవరూ వాడరు. వెక్కిరిస్తారు. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.

జవాబు :  నీ సమస్యను నక్టర్నల్ డైయూరేసిస్ అంటారు. సాధారణంగా 5 సంవత్సరాలు వచ్చేసరికి 85 శాతం మందికి, 10 ఏళ్ళ వయస్సు వచ్చే సరికి 95 శాతం మంది పిల్లలకు మూత్రకోశం మీద నియంత్రణ వస్తుంది. అలా కాకుండా వయసు పెరిగినా రాత్రిళ్ళు పక్కతడిపే అలవాటుంటే మాత్రం కారణాలు శోధించాలి. నరాల జబ్బులు, మూత్ర వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు, అనువంశిక కారణాలు (అంటే తల్లిదండ్రులకు చిన్నప్పుడు పక్కతడిపే అలవాటుంటే పిల్లలకు వస్తుంది) పుట్టుకతోనే కిడ్నీల్లో, ఇతర మూత్ర మార్గాల్లో నిర్మాణ పరమైన లోపాలు కూడా ఈ వ్యాధికి కారణాలు అవుతాయి. అలాగే, మగ పిల్లల కంటే కూడా ఆడపిల్లలకు మూత్రనాళం పొడవు తక్కువగా ఉండటం వల్ల మూత్ర నాళాల్లో ఇన్‌ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెంది సిైస్టెటిస్ అనే మూత్రకోశపు వ్యాధికి చాలాసార్లు గురై ఈ రాత్రిళ్ళు పక్క తడపడం అనే వ్యాధికి లోనవుతారు.

మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి రావడం, రాత్రిళ్ళు ఎక్కువసార్లు నిద్రలో పక్కలోనే మూత్ర విసర్జన జరగడం ఈ వ్యాధి లక్షణాలు. అలాగే, మలబద్దకం కూడా ఈ వ్యాధికి ఓ కారణం. పెద్ద పేగు చివరి భాగమైన రెక్టమ్ లేదా పురీషనాళం విసర్జక పదార్థాలతో నిండిపోయి దాని ముందువైపు ఉండే మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి నిద్రలో మూత్ర విసర్జన జరుగుతుంది. అలాగే భయం, ఆందోళన, మానసిక ఒత్తిడి కూడా మూత్రకోశ కండరాలను అనియంత్రిత సంకోచాలకు గురిచేస్తాయి. దీనివల్ల భయంకరమైన కలలు వచ్చాక నిద్రలో మూత్ర విసర్జన జరుగుతుంది.

జువినైల్ డయాబెటిస్ ఉన్న పిల్లలు, టీనేజర్స్‌కు కూడా రాత్రిళ్లు పక్కలో మూత్ర విసర్జన అలవాటు ఉంటుంది. వీరిలో రక్తంలో ఎక్కువైన చక్కెరను కిడ్నీలు పెద్ద మొత్తంలో విసర్జిస్తాయి. ఈ క్రమంలో మూత్రాశయంలో పరిమాణానికి మించి మూత్రం తయారవడంతో నిద్రలో అసంకల్పితంగా మూత్ర విసర్జన జరుగుతుంది. పైన చెప్పిన కారణాల్లో నీకేమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని చికిత్స తీసుకోవాలి. నీ పేరేంట్స్‌కి ఈ విషయం ఈపాటికే తెలిసి ఉండాలి.

అలాగే, రాత్రిపూట కూల్‌డ్రింక్స్, టీ, కాఫీ వంటి మూత్రాన్ని జారీచేసే ప్రేరక ద్రవాల్ని తీసుకోవద్దు. పడుకునే ముందు ఖచ్చితంగా మూత్ర విసర్జన చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే, అలారం పెట్టుకుని, మధ్య రాత్రి లేచి మూత్ర విసర్జన చేయాలి. మలబద్దకాన్ని పోగొట్టే ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మానసిక ఆందోళన కారణమైతే నెగెటివ్ ఆలోచనా ధోరణిని పాజిటివ్ ఆలోచనా ధోరణికి మార్చుకోండి. కోపం, ఆందోళన తగ్గే దిశలో కౌన్సెలింగ్, ఫిజియోథెరపీ తీసుకోండి.

డీపర్ రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీథింగ్ ఎక్సర్‌సైజెస్ మానసిక ప్రశాతంతతను పెంచుతాయి. పగటివేళ కూడా మూత్ర విసర్జన ఎక్కువసార్లు అవుతే యూరాలజిస్ట్‌ని కలవాలి. షుగరు ఉందేమో పరీక్ష చేయించుకోవాలి. అలాగే, యూరాలజిస్ట్ పర్యవేక్షణలో కొన్ని రోజులపాటు మూత్రకోశపు అనవసర సంకోచాలను నియంత్రించే మందులు వాడాలి.

No comments:

Post a Comment